

నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద కృష్ణా జలాలు ఆకుపచ్చ రంగులోకి మారడం ఆందోళనకు దారి తీసింది. నీటి రంగు మారడానికి కాలుష్యమే కారణమన్న వాదనలు వినిపించగా, నీటిని పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం కాలుష్యం కారణం కాదని తెలిపారు. నాచు వల్లే నీరు ఆకుపచ్చగా మారిందని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద చరిత్రలో తొలిసారిగా నీరు ఆకుపచ్చగా కనిపించిందని సమాచారం. దీంతో ఇరిగేషన్ డీఈ నాగేశ్వర్‌రావు శుక్రవారం పడవలో ప్రాజెక్టు మధ్యలోకి వెళ్లి నీటిని పరిశీలించారు. దాదాపు 30 నుంచి 40 శాతం నీరు రంగు మారినట్లు గుర్తించి, నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
నీటి కాలుష్యం కారణంగా చేపలు చనిపోతున్నాయన్న మత్స్యకారుల ఆరోపణలను డీఈ నాగేశ్వర్‌రావు ఖండించారు. చేపల మృతికి కాలుష్యమే కారణమని నిర్ధారించేందుకు ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రాజెక్టులోని చేపలకు ఆక్సిజన్ కొరత లేదన్నారు. జూరాల నీటిని పరిశీలించిన మిషన్ భగీరథ అధికారులు కూడా నీటిలో బ్యాక్టీరియా లేదని తెలిపారు. మరోవైపు, నాగార్జున సాగర్ సమీపంలోని దయ్యాలగండి వద్ద బ్యాక్‌వాటర్ ఇటీవల ఆకుపచ్చగా మారడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరీక్షలు నిర్వహించారు. నీటిలో ఎలాంటి రసాయనాలు లేవని వెల్లడించారు. గురువారం నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ వద్ద కూడా నీరు ఆకుపచ్చగా కనిపించింది. అడుగున ఉన్న నాచు పైకి రావడం వల్లే నీటి రంగు మారిందని ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!