

ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. ఇందులో భాగంగా పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ‘పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’ జరగనుంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, డీప్‌టెక్, స్టార్టప్‌లు, డిజిటల్ ఆవిష్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.
‘ఆంధ్రాస్ రెసిలెంట్ డీప్‌టెక్ డికేడ్: స్వర్ణాంధ్ర టూ వికసిత్ భారత్ 2047’ థీమ్‌తో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సదస్సు నిర్వహించనున్నారు. ఏఐ, డీప్‌టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆవిష్కరణలపై ప్యానల్ చర్చలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఐఐటీ పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఔత్సాహికులు, ఆవిష్కర్తలు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన సుమారు ఐదు లక్షల మంది ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించేందుకు ముందుకొస్తోంది.
ఇదిలా ఉండగా, పాన్‌ఐఐటీ అలుమ్ని నెట్‌వర్క్‌కు చెందిన ఐఐటీ డైరెక్టర్లు, పరిశ్రమల సీఈవోలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో విందు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేయనున్న వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడంపై చర్చించారు. మరోవైపు, క్యూబిట్ సంస్థ దేశీయ పరిజ్ఞానంతో మరో నాలుగు ‘క్యూ-శివ’ క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్టింగ్ ల్యాబ్ కంప్యూటర్లను రూపొందించింది. వీటిని శనివారం జరిగే సదస్సులో సీఎం ఆవిష్కరించనున్నారు. బిడ్డింగ్ ప్రక్రియలో ఒక టెస్టింగ్ ల్యాబ్‌ను ఆంధ్రా యూనివర్సిటీ దక్కించుకుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!