

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ప్రస్తుతం డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ‘ఇట్లు అర్జున్’ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి ‘కాకా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంగీత దర్శకుడు తమన్ ఎక్కడికి వెళ్లినా ఈ మధ్య ‘కాకా’ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడని చిరంజీవి సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర సినిమాల గురించి మాట్లాడటం లేదంటూ మిగతావారు తమన్‌ను ప్రశ్నించే ప్రమాదం ఉందని చమత్కరించారు. ‘మా సినిమా గురించి చెప్పడం లేదు.. కాకానే కేకనా?’ అని అడుగుతున్నారని నవ్వుతూ అన్నారు. అయితే తమన్ చెబుతున్నది వంద శాతం నిజమేనని, ‘కాకా’తో కచ్చితంగా విజయాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై దర్శకుడు బాబీ ‘కాకానే చెప్పేశాడుగా’ అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!