

విశాఖలో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన ఏఏఏ సినిమాస్ ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానుండటంతో ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణలో ఉన్న ఆయన ప్రత్యేకంగా విరామం తీసుకుని ఆగస్టు 9న జరిగే ఈ కార్యక్రమానికి వస్తున్నారు. గతంలో సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రారంభ కార్యక్రమాన్ని పూర్తిగా ఆహ్వానితులు, కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. సాధారణ ప్రేక్షకులకు ప్రవేశం కల్పించకుండా, అల్లు అర్జున్ పర్యటన పూర్తయ్యే వరకు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా పోలీసులతో పాటు ప్రైవేట్ భద్రతా సిబ్బందిని కూడా మోహరించేందుకు చర్యలు చేపట్టారు.
విశాఖలోని ఈ కొత్త మల్టీప్లెక్స్ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో సిద్ధమైంది. మొత్తం 8 స్క్రీన్లతో రూపొందిన ఈ థియేటర్‌లో అత్యంత భారీ ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యుత్తమ విజువల్ అనుభూతితో పాటు ఆధునిక సౌండ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభోత్సవం పూర్తైన తర్వాత ఆగస్టు 10 నుంచి సాధారణ ప్రేక్షకులకు థియేటర్ సేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖ సినీప్రియులకు మరో ప్రీమియం సినిమా గమ్యస్థానంగా ఏఏఏ సినిమాస్ మారుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ హాజరుతో ప్రారంభ వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలకు కూడా సినీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!