

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కల్యాణ్ సుబ్బారావును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు కూడా జనసేనలో చేరారు.
పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్ కల్యాణ్ వారికి సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!