

ఏ.ఆర్.రెహమాన్‌పై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన కంగనా, తాను కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకే ఇండస్ట్రీలో వివక్ష, పక్షపాతాలు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. అయితే, తన జీవితంలో ఇంత ద్వేషపూరితంగా, పక్షపాతంగా వ్యవహరించిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదంటూ ఏ.ఆర్.రెహమాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాను దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సంగీతం అందించమని రెహమాన్‌ను సంప్రదించగా, ఆయన కథ వినడానికి కూడా ఆసక్తి చూపలేదని కంగనా ఆరోపించారు. ఆ చిత్రం ఒక వర్గానికి సంబంధించిన ‘ప్రచార సినిమా’ అని భావించి, అందులో భాగం కావడానికి ఆయన నిరాకరించినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే, ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని విమర్శకులు ‘మాస్టర్‌పీస్’ గా ప్రశంసించారని, సమతుల్య దృక్పథంతో ఉందని ప్రతిపక్ష నేతలు కూడా మెచ్చుకున్నారని కంగనా తెలిపారు. చివరగా, “ద్వేషంతో అంధులైన వారిని చూసి జాలి కలుగుతోంది” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్లో రాజకీయాలు, పక్షపాతం అంశాలపై చర్చ మరింత ఉధృతమైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!