

90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన చిత్రం ‘అల్లరి ప్రియుడు’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమకథలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో రాజశేఖర్–రమ్యకృష్ణల కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం వీరిద్దరూ దీర్ఘ సుమంగళీభవ, బలరామకృష్ణులు వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
అయితే 1998 తర్వాత ఈ జోడీ కలిసి కనిపించలేదు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ మరోసారి తెరపై కనిపించబోతున్నారని సమాచారం. కొంత గ్యాప్ అనంతరం రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో, ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్‌గా తెరకెక్కనుంది.
గ్రామీణ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, తమిళ వెర్షన్లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ పోషిస్తున్నారు.
పిట్టగోడ, 35 ఎల్లెలో చిత్రాల్లో నటించిన విశ్వదేవ్ రాచకొండ స్వీయ నిర్మాణంలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నారు.
రాజశేఖర్ కుమార్తె ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది.
తమిళంలో శ్వాసిక పోషించిన పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో ఇంకా ప్రకటించలేదు.
రాజశేఖర్ చివరి చిత్రం ‘శేఖర్’కు అతని భార్య జీవితనే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రీమేక్‌కు కూడా ఆమెనే దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతో మంచి విజయాలు సాధించినా, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల కథలతో రీమేక్ చేసిన ‘గడ్డం గ్యాంగ్’, ‘శేఖర్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. అయినప్పటికీ ఆయన మళ్లీ రీమేక్ రిస్క్ తీసుకుంటుండటం ఆసక్తి రేపుతోంది.
ఫలితం ఎలా ఉండబోతుందో అందరి చూపు అక్కడికే వెళ్లింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!