

సుమారు రూ.46 కోట్ల విలువైన చెక్కులను తనకు తెలియకుండా తీసుకుని, వాటిని నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించారంటూ సోదరి రాధ చేసిన ఫిర్యాదుపై నటి అంబిక స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాధ గదిలోకి వెళ్లి చెక్కులు దొంగిలించానని ఆరోపించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తన వస్తువులు, విలువైన పత్రాల విషయంలో రాధ ఎంతో జాగ్రత్తగా ఉంటారని, నంబర్ లాక్ ఉన్న బ్యాగుల్లో వాటిని భద్రపరుచుకుంటారని పేర్కొంటూ.. అలాంటి పరిస్థితుల్లో తాను చెక్కులను దొంగిలించాననే ఆరోపణలు ఎలా సాధ్యమవుతాయని అంబిక ప్రశ్నించారు. రాధ ఫిర్యాదు ప్రకారం ఐదు పాత చెక్కులు అంబిక పేరుతో నగదీకరణకు సమర్పించబడినట్లు సమాచారం.
ఈ వివాదం కేవలం చెక్కుల వ్యవహారానికే పరిమితం కాదని, కుటుంబ ఆస్తికి సంబంధించిన అంశాలతోనూ ముడిపడి ఉందని అంబిక తెలిపారు. ‘ఏఆర్‌ఎస్ గార్డెన్’ను తన కష్టార్జితంతో నిర్మించానని, అనంతరం దాని పేరును ‘ఆర్‌ఆర్ గార్డెన్’గా మార్చడం, తనకు రావాల్సిన వాటాల విషయంలో వివాదం తలెత్తడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. కుటుంబంలోనే సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, చివరకు విషయం న్యాయస్థానానికి వెళ్లిందన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున చట్టాన్ని గౌరవిస్తూ ఈ అంశంపై మరిన్ని బహిరంగ వ్యాఖ్యలు చేయబోనని అంబిక స్పష్టం చేశారు. రాధ చేసిన ఆరోపణలు ఇంకా న్యాయపరంగా నిర్ధారణ కాలేదు; దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!