

తమిళనాడులోని తేని జిల్లాలో రోడ్డుపై బాణసంచా కాలుస్తున్న కొందరితో జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారడంతో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. తేని డీఎస్పీ కార్యాలయంలో స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్ శనివారం రాత్రి విధులు ముగించుకుని సాధారణ దుస్తుల్లో ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై కొందరు బాణసంచా కాలుస్తుండటాన్ని గమనించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుపై టపాసులు కాల్చవద్దని సూచించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనను తోసి, మోచేతితో బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సెంథిల్ కుమార్ కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బందితో సహా తొమ్మిది మంది హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పండుగ వేళ బాణసంచా శబ్దాల కంటే కత్తులతో జరుగుతున్న దాడులే ఎక్కువగా వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును ఖండించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!