

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ ప్రక్రియ రూపంలో అనూహ్య అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రమోషన్లకు సిద్ధమైన చిత్రబృందానికి చివరి నిమిషంలో ఈ పరిణామం ఎదురైంది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడటంతో సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. అయితే విడుదల వాయిదాపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
1960ల కాలంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో శర్వానంద్ గతంలో ఎన్నడూ కనిపించని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. అప్పటి గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఆడుకాలం నరేన్, రోహిత్ పాఠక్, రవి వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. రివైజింగ్ కమిటీ నుంచి ఎలాంటి క్లియరెన్స్ వస్తుంది? సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!