

ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల్లో సేవలందిస్తున్న అమెరికాకు చెందిన స్ప్లాష్‌బీఐ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని అభివృద్ధి చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 515కు పైగా జీసీసీలు ఉండగా, వాటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు నగరంలో కార్యకలాపాలు ప్రారంభించాయని, వచ్చే ఏడాదిలో మరో 100 జీసీసీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా ప్రపంచస్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ రంగాల్లోనూ వాటిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లోని 500కు పైగా సంస్థలకు స్ప్లాష్‌బీఐ సేవలందిస్తోందని వివరించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో హైదరాబాద్‌లో 100 మిలియన్ డాలర్లు (10 కోట్ల అమెరికన్ డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించిందన్నారు. నగరం కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ వేదికతో పాటు స్ప్లాష్ ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేయనుందని, తద్వారా 275 మంది నిపుణులకు ఉపాధి లభించనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ప్లాష్‌బీఐ సీఈఓ నవీన్ మిగ్లానీ, ప్రెసిడెంట్, సీటీఓ కిరణ్ రెడ్డి పాశం తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!