

చలికాలంలో చలి, పొగమంచుతో పాటు వాయు కాలుష్యం కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు, పొగ, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు కళ్ల ఉపరితలంపై చేరి చికాకు కలిగిస్తాయి. దీనివల్ల కళ్లను రక్షించే కన్నీటి పొర దెబ్బతిని పొడిబారడం, మంట, దురద, ఎర్రబడటం, పదేపదే నీళ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కళ్లలో ఇసుక పడినట్లు అనిపించడం, కనురెప్పలు బరువుగా ఉండటం, రెప్పలు కొట్టినప్పుడు తాత్కాలికంగా తగ్గే మసక చూపు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు, పొగమంచుతో కూడిన కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్యలు తీవ్రం కావచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లినప్పుడు సాధారణంగా లక్షణాలు తగ్గుతాయి.
కళ్ల సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. దురదగా ఉన్నా కళ్లను చేతులతో రుద్దకూడదు. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వైద్యుల సూచన మేరకు సంరక్షక రసాయనాలు లేని కళ్ల తేమను కాపాడే చుక్కల మందులు ఉపయోగించవచ్చు. మంట, దురద ఉన్నప్పుడు శుభ్రమైన చల్లని వస్త్రాన్ని మూసిన కనురెప్పలపై కొన్ని నిమిషాలు ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు లేదా ఎండ నుంచి రక్షించే అద్దాలు ధరించడం, కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో కంటికి అమర్చుకునే కటకాలకు బదులుగా సాధారణ కళ్లద్దాలు ఉపయోగించడం మంచిది. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచుకోవడంతో పాటు చరవాణి, కంప్యూటర్ తెరలను చూసే సమయంలో మధ్యమధ్యలో విరామం ఇవ్వాలి. వైద్యుల సలహా లేకుండా వాపును తగ్గించే మందులు, సూక్ష్మజీవుల నివారణ మందులు లేదా కళ్ల ఎర్రదనాన్ని తగ్గించే చుక్కల మందులు వాడకూడదు. తీవ్రమైన కంటి నొప్పి, చూపు తగ్గడం, వెలుతురు చూడలేకపోవడం, చిక్కటి స్రావం రావడం లేదా రెండు మూడు రోజులు గడిచినా సమస్య తగ్గకపోతే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కంటికి అమర్చుకునే కటకాలు వాడేవారిలో నొప్పి, ఎర్రదనం కనిపిస్తే అదే రోజు వైద్య పరీక్ష చేయించుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!