

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కించిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను సాధారణ భక్తి చిత్రంగా కాకుండా ఒక శక్తివంతమైన ‘డివోషనల్ ఫోర్స్’గా అభివర్ణించారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం కృషి చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందిస్తూ, సినిమాపై వచ్చే ప్రతికూల విమర్శలను పట్టించుకోవద్దని చిత్ర బృందానికి సూచించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విభిన్నమైన కథనం, ప్రభావవంతమైన దర్శకత్వం, నటీనటుల అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని వర్మ పేర్కొన్నారు. రాముడి పాత్రను కేవలం దైవిక రూపంలో కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే వీరుడిగా చూపించడం ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా సీతాదేవి అపహరణ తర్వాత రాముడు ఆశ్రమంలో ఒంటరిగా కనిపించే సన్నివేశం, రావణుడిగా యష్ నటన, జటాయువుగా అనుపమ్ ఖేర్ ప్రదర్శనను ఆర్జీవీ ప్రత్యేకంగా ప్రశంసించారు. యుద్ధ సన్నివేశాల్లోని తీవ్రత, పాత్రల మానసిక సంఘర్షణలు, భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. ముఖ్యంగా యష్ తన హావభావాలతోనే రావణుడి శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించారని పేర్కొన్నారు. జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్ పోరాట పటిమ, త్యాగనిరతిని ప్రశంసించారు. నవంబర్ 5, 2026న విడుదలైన ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణుడిగా యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. సినిమా పోస్ట్ క్రెడిట్స్ సీన్‌లో హనుమంతుడిగా సన్నీ డియోల్‌ను పరిచయం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!