

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, చైనాకు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ మధ్య పరిచయం, ఆమెపై వచ్చిన గూఢచర్యం ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మీడియా, బ్యాంకింగ్, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో పనిచేసిన అనుభవం ఆలిస్ హువాంగ్‌కు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. హునాన్ టీవీ, సీసీటీవీ వంటి సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆమె.. అనంతరం హెచ్‌ఎస్‌బీసీ, సిటిక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలతో పనిచేశారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ సంస్థలోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వహించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 జూన్‌లో తైవాన్‌లోని తైపేలో జరిగిన ఓ సమావేశంలో జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిచయం వ్యాపార సంబంధాల్లో భాగమేనని ఎన్విడియా స్పష్టం చేసింది.
మరోవైపు, ఆలిస్ హువాంగ్ చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ కీలక సమాచారాన్ని బీజింగ్‌కు చేరవేస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా వర్గాలకు ఉన్నట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే ఆమె నిజంగా గూఢచర్యానికి పాల్పడ్డారనడానికి లేదా ఎన్విడియా రహస్య సమాచారాన్ని చైనాకు చేరవేశారనడానికి ఇప్పటివరకు బహిరంగంగా నిర్ధారిత ఆధారాలు లేవు. జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం కూడా ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. అయితే ఆ సంబంధం ఆలిస్ హువాంగ్‌తోనే ఉందని నిర్ధారణ కాలేదు. ఈ ఆరోపణలపై మెగాస్పీడ్ సంస్థ స్వతంత్ర న్యాయ నిపుణులతో సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిపింది. ఎన్విడియా మాత్రం తన సీఈఓకు ఆలిస్ హువాంగ్‌తో ఉన్న పరిచయం సాధారణ వ్యాపార సంబంధమేనని, కీలకమైన వాణిజ్య రహస్యాలు పంచుకున్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఏఐ, సెమీకండక్టర్ టెక్నాలజీ పోటీ నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!