

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వెసులుబాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులకు కూడా వర్తించనుంది. అయితే, సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటన 2004 సెప్టెంబర్ 1కి ముందే జారీ అయి ఉండాలి. ఆ ప్రకటన ఆధారంగా ఉద్యోగి 2004 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత విధుల్లో చేరి ఉండాలి.
అర్హులైన వారు నిధి పోర్టల్‌లోని సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు అనే విభాగం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నియామక ప్రకటన, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరిన ఉత్తర్వులు వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. సంబంధిత అధికారులు దరఖాస్తులు, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం పాత పెన్షన్ విధానంలోకి మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఓపీఎస్‌కు మారేందుకు అనుమతి పొందిన ఉద్యోగులకు ఏపీ సవరించిన పెన్షన్ నిబంధనలు–1980 వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!