

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్ ‘ఈత’. ప్రముఖ మరాఠీ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా.. విఠాబాయి పాత్ర కోసం తాను చేసిన కృషి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించారు. ఈ సినిమాకు అంగీకరించే సమయానికి తనకు లావణి నృత్యంపై పెద్దగా అవగాహన లేదని చెప్పారు. పాత్రకు సిద్ధమయ్యేందుకు పలు వర్క్‌షాప్‌లలో పాల్గొనడంతో పాటు, శకుంతల జీ వంటి సీనియర్ కళాకారుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
కేవలం గజ్జెలు కట్టుకుని నృత్య అడుగులు వేయడం మాత్రమే కాకుండా, తమాషా కళాకారుల జీవితాల్లోని కష్టాలు, బాధలు, సంతోషాన్ని హావభావాల ద్వారా పలికించడం అసలైన సవాలుగా అనిపించిందని శ్రద్ధా పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఒక్కో కాలికి నాలుగు కిలోల చొప్పున మొత్తం ఎనిమిది కిలోల బరువున్న గజ్జెలు ధరించి నృత్యం చేశానని వెల్లడించారు. ఓ పాట చిత్రీకరణ సమయంలో గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు విరామం తీసుకున్నానని చెప్పారు. ప్రతి పాటకు ముందు దర్శకుడు రెండు మూడు వారాల పాటు కఠినమైన రిహార్సల్స్ చేయించారని, అవి పాత్రలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఉపయోగపడ్డాయని తెలిపారు. సినిమాల ఎంపికలో కథకే ప్రాధాన్యత ఇస్తానని, భవిష్యత్తులో మంచి కథలతో వచ్చిన సినిమాల్లో నటించే అవకాశాలను కోల్పోయాననే బాధ తనకు ఉండకూడదని శ్రద్ధా అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!