

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చార్మింగ్ స్టార్ శర్వానంద్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా మీద ఉన్న ప్రేమతో దర్శకుడు తుకారాం ఈ స్థాయికి వచ్చాడని ప్రశంసించారు. ట్రైలర్ చాలా నిజాయితీగా ఉందని, చూసిన వెంటనే సినిమా చూడాలనే ఆసక్తి కలిగిందని చెప్పారు. హీరో వర్ధన్‌ను చూస్తే ఇది అతని మొదటి సినిమా అనిపించలేదని, మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా కనిపిస్తున్నాడని అన్నారు. సినిమా టీమ్‌కు మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు.
“ప్రేమ నిప్పులాంటిది… రెండు జీవితాలకు వెలుగునిచ్చే దీపమవ్వొచ్చు లేదా అడవిని కాల్చే అగ్నిగా మారొచ్చు” అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ చివరి వరకు ఆకట్టుకుంటుంది. వర్ధన్, కృష్ణప్రియల మధ్య కెమిస్ట్రీ సహజంగా కనిపిస్తుంది. భావోద్వేగాలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. AIS నౌఫల్ రాజా సంగీతం అందిస్తుండగా, రుద్రసాయి డీవోపీగా, జెస్విన్ ప్రభు ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!