

విభిన్న కథలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణపై పూర్తి దృష్టి పెట్టింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ సరసన సీత పాత్రలో నటిస్తున్న ఆమె, ఈ భారీ ప్రాజెక్ట్ కారణంగా కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. మంచి కథ, బలమైన పాత్ర ఉంటేనే సినిమాలు అంగీకరించే ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల సాయి పల్లవికి కొత్త కథ వినిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మైథాలజీ అంశాలతో కూడిన ఈ కథ ఆమెను ఆకట్టుకుందని, ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సాయి పల్లవి మరోసారి కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందా అనే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!