

డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ మృతిని కోరుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా నాయకురాళ్లతో వ్యవహరించిన తీరు గర్హనీయమని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కోరారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలపైనా కేసులు నమోదు చేయాలని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్‌కు వెళ్లడం వల్లే ఆ స్థలం అపవిత్రమైందని, దళితుల వల్ల కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన విలువైన సమయాన్ని ప్రభుత్వం, అధికార పక్షం దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ ‘మొద్దు పాలన’కు చరమగీతం పాడుతామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!