

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న కుట్రపూరిత ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. సమావేశాల తొలిరోజు సభాపతిని ఉద్దేశించి దుర్భాషలాడటం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం వంటి ఘటనలపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాసనసభ, ప్రభుత్వం అండగా ఉంటాయని, ఆయన మనోధైర్యం కోల్పోవద్దని కోరారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు.
శాసనసభలో బుధవారం జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిస్తూ రేవంత్ రెడ్డి, కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడంతో పాటు సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని, సభాపతి తల్లిని కూడా అవమానించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ, సభాపతిని అవమానించేలా వ్యవహరించడం తీవ్రమైన విషయమన్నారు. సెప్టెంబర్ 7 నుంచి విద్యారంగ సమస్యలు, ధరణి అక్రమాలు, 22(ఎ) అంశాలతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించిందని, అయితే చర్చ జరగకుండా అడ్డుకున్నారని సీఎం పేర్కొన్నారు. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!