

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావుపై బహిరంగంగా ‘బ్లాక్ మ్యాజిక్’, ‘క్షుద్రపూజలు’ చేశారంటూ ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పేర్కొంటూ న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. కేసు నంబర్ 776/36/2/2026 కింద ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్.. నాలుగు వారాల్లోగా తీసుకున్న చర్యలపై ఆంగ్లంలో ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాలని తెలంగాణ డీజీపీని సెప్టెంబర్ 9న ఆదేశించినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. హరీశ్‌రావు అనుమతితో, ఆయన తరఫున కారుపోతుల రేవంత్ ఆగస్టు 22న మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12(ఏ) కింద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
జూలై 31 నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హరీశ్‌రావు వర్షాలు ఆగిపోవడానికి, కరువు రావడానికి ఆలయాల్లో తాంత్రిక పూజలు చేయించారంటూ బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆలయ రికార్డులు, పూజారులు, రసీదులు లేదా సాక్ష్యాలు వెల్లడించలేదని తెలిపారు. ఆగస్టు 4న ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ, ఆగస్టు 17న డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆరోపించారు. క్షుద్రపూజల వల్ల వర్షాలు ఆగుతాయనే వ్యాఖ్యలు ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే ప్రమాదం ఉందని, ‘చేతబడి’ ఆరోపణలతో మహిళలు, వితంతువులు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడుల ముప్పు పెరుగుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు లేకపోవడమే ఫిర్యాదుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!