

టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న పెద్ద సినిమాలపై అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 న, రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ఏప్రిల్ 30 న విడుదల కానున్నాయి. దీంతో రెండు సినిమాలు క్లాష్ కాకుండా ప్లాన్ చేసినందుకు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భారీ సోషియో - ఫాంటసీ మూవీ విశ్వంభరపై పడింది.
'బింబిసార' దర్శకుడు వశిష్టా రూపొందించిన విశ్వంభర షూటింగ్ పూర్తయింది. కానీ భారీ VFX పనుల కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది. తొలుత గత ఏడాది (2025) సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ నాణ్యత ఆశించిన స్థాయికి రాకపోవడంతో రీ-వర్క్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాను పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. విశ్వంభర అంతకుముందే పూర్తైనా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచుతోంది. తాజాగా నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు, “మొదటి టీజర్‌కు వచ్చిన స్పందనను గమనించి, రెండో టీజర్లో VFX ని మెరుగుపరిచాం. అన్ని గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అభిమానులు కాస్త ఓపిక పట్టాలి” అని చెప్పారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జూలై రెండో వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అన్ని బిజినెస్ డీల్స్ క్లోజ్ అయితే జూలై 9 ను టార్గెట్ చేసినట్టు సమాచారం. కానీ ఆలస్యం అయితే అక్టోబర్‌కు వాయిదా పడే అవకాశం ఉంది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష తో పాటు అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి పట్నాయక్, మౌని రాయ్ నటిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. మొదట బడ్జెట్ రూ.150 కోట్లు కాగా, VFX రీ-వర్క్ కారణంగా దాదాపు రెట్టింపు అయినట్టు టాక్. పవన్, చరణ్ సినిమాల తర్వాత ఇప్పుడు మెగా అభిమానుల దృష్టి మొత్తం విశ్వంభర పైనే ఉంది. చిరంజీవి ఈ వేసవిలో సినిమా రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చినందున, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!