

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలు ప్రతిష్ఠంభనకు గురైన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని న్యూయార్క్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు ‘ఆక్సియోస్’ కథనం వెల్లడించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో సాగుతున్న పరోక్ష చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
అయితే అమెరికా వాదనను ఇరాన్ ఖండించింది. తమ ప్రతినిధి బృందం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే న్యూయార్క్ నుంచి బయలుదేరిందని ఇరాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ స్పష్టం చేసింది. సెప్టెంబరు 17నే తమ ప్రయాణ షెడ్యూల్‌ను అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేసినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి, ప్రాంతీయ అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఖతార్ మధ్యవర్తులు ఇరుపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!