

భారత క్రికెటర్ రింకూ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. త్వరలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోనున్న నేపథ్యంలో ప్రధానికి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించడంతో పాటు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. నవంబర్ 15న ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రింకూ పంచుకున్నారు. తమ కుటుంబానికి ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నారు. ఈ జంట డిసెంబర్ 4, 2026న లక్నోలోని రమదా హోటల్లో వివాహం చేసుకోనున్నారు. అంతకుముందు ఈ నెల 13న రింకూ తల్లి బీనా దేవి, సోదరుడు సోనూ సింగ్, సోదరి నేహా సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం 2025 జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ హోటల్లో జరిగింది. ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. 2024లో ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో ఒక ఫ్యాన్ పేజీలో ప్రియా ఫొటోను చూసిన తర్వాత తమ పరిచయం ప్రారంభమైందని రింకూ గతంలో వెల్లడించారు. ఆ పరిచయం క్రమంగా సంభాషణలుగా మారి ప్రేమకు దారితీసిందని, 2022లో ఆమెపై ఇష్టం పెరిగిందని తెలిపారు. మరోవైపు, ఈ నెల 19 నుంచి 29 వరకు దోహాలో జరగనున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు రింకూ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!