

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక సైనిక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ తన స్ట్రైక్ ఫోర్స్‌తో కలిసి ఈ ప్రాంతానికి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు ధ్రువీకరించినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో శాన్ డియాగో నుంచి బయలుదేరిన ఈ నౌక వేలాది మంది అదనపు సైనిక బలగాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. థియోడర్ రూజ్‌వెల్ట్ రాకతో పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన విమాన వాహక నౌకల సంఖ్య మూడుకు చేరింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా తన నౌకాదళ బలాన్ని మరింత పెంచినట్లయింది.
ఇప్పటికే ఇరాన్ నౌకల దిగ్బంధన చర్యల్లో భాగంగా అమెరికా యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ విమాన వాహక నౌకలను ఈ ప్రాంతంలో మోహరించింది. వీటిలో జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ఏప్రిల్‌లో, జార్జ్ వాషింగ్టన్ ఆగస్టులో పశ్చిమాసియాకు చేరుకున్నాయి. అమెరికా నేవీ వివరాల ప్రకారం అరేబియా సముద్రంలోని నౌకాదళ బలగాల్లో ప్రస్తుతం మూడు విమాన వాహక నౌకలతో పాటు 13 డిస్ట్రాయర్లు, రెండు క్రూజర్లు, ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ ఉన్నాయి. వీటికి అదనంగా పలు చిన్నపాటి యుద్ధ నౌకలు కూడా మోహరించి ఉన్నాయి. తాజా పరిణామంతో పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికి మరింత బలపడినట్లు కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!