

తన కుటుంబం గురించి ప్రచారంలో ఉన్న అపోహలు, అవాస్తవాలను తొలగించి.. తన అనుభవాలు, జ్ఞాపకాల ద్వారా వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆత్మకథ రాసినట్లు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. దిల్లీలో తన పుస్తకం బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీల హత్యలకు సంబంధించిన అంశాలను రాయడం అత్యంత కష్టంగా అనిపించిందని వెల్లడించారు. రాజీవ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయనతో సాగిన ప్రేమ ప్రయాణం అద్భుతమైనదని పేర్కొన్నారు. తన కథను రాయాలని స్నేహితులు చాలాకాలంగా సూచించినప్పటికీ, వ్యక్తిగత భావాలను బయటపెట్టేందుకు తొలుత వెనుకాడినట్లు చెప్పారు. అయితే రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు రచయిత్రి మంజులికా దుబే ప్రోత్సాహంతో చివరకు పుస్తకం రాయడానికి అంగీకరించినట్లు తెలిపారు. రాయడం ప్రారంభించిన తర్వాత తన ఆలోచనలు, జ్ఞాపకాలు సహజంగానే అక్షరరూపం దాల్చాయని, తాను ఎప్పుడూ డైరీ రాయకపోవడంతో పుస్తకంలోని చాలా విషయాలను జ్ఞాపకాల ఆధారంగానే పొందుపరిచానని వివరించారు.
బిలాంగింగ్ అనే పేరు తన జీవిత ప్రయాణానికి, కొత్త వాతావరణంలో మమేకమయ్యేందుకు చేసిన ప్రయత్నానికి ప్రతీకగా నిలుస్తుందని సోనియా తెలిపారు. ఇందిరా గాంధీ కోడలిగా మారినప్పుడు ఇటలీకి భిన్నమైన భారతీయ వాతావరణానికి అలవాటు పడటం తొలుత కొంత కష్టంగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు. ఇందిరను మొదట్లో చూసి భయపడేదాన్నని, ఆమెను ‘మమ్మీ’ అని పిలవడానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పారు. రాజీవ్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, అలా చేస్తే కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుందని ఆందోళన చెందానని వెల్లడించారు. అయితే ఆ తర్వాత తమ జీవితాలు పూర్తిగా మారిపోయినా, పరస్పర అనుబంధం మరింత బలపడిందన్నారు. రాజీవ్ మరణం తర్వాత తాను చిన్నపిల్లలా మారిపోయానని, తన పిల్లలు రాహుల్, ప్రియాంక తనను తల్లిదండ్రుల్లా చూసుకున్నారని భావోద్వేగంగా చెప్పారు. తన పుస్తకానికి పాఠకుల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రేమ తనను ఎంతో కదిలించాయని పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!