

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమ్మిట్ వేదికకు చేరుకునేలా రవాణా మార్గాలను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతినిధులు సులభంగా, సకాలంలో ప్రధాన వేదికకు చేరుకునేలా సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఏడాది బేగరికంచె–మీర్‌ఖాన్‌పేట పరిధిలోని టీజీఐఐసీ లేఅవుట్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 14 నుంచి హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీదుగా, కొత్తూరు జంక్షన్ నుంచి ఫార్మా రోడ్డు మీదుగా వాహనాలు చేరుకున్నాయి. అయితే, ఈసారి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి నేరుగా సమ్మిట్ ప్రాంగణానికి చేరుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తొలుత రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ద్వారా ప్రతినిధులను తీసుకురావాలని భావించినప్పటికీ, ఆ రహదారి నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రతన్ టాటా ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రహదారిపై బీటీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా విదేశీ ప్రతినిధులను నేరుగా సమ్మిట్ వేదిక వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!