

మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలర్స్ షోరూంలో జరిగిన భారీ నగల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 25 ఏళ్ల నిషాంత్ కృష్ణ అనే బైక్ ట్యాక్సీ డ్రైవర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ చోరీకి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ నెల 11న రాత్రి షోరూంకు మూడుసార్లు వెళ్లి సాధారణ కస్టమర్లా రెక్కీ నిర్వహించాడు. భద్రతా ఏర్పాట్లు, నగల డిస్ప్లే, తప్పించుకునే మార్గాలను పరిశీలించిన అనంతరం నల్లటి దుస్తులు, ముఖానికి ముసుగు, చేతులకు గ్లౌజులు ధరించి భవనం వెనుకవైపు నుంచి పై అంతస్తులోకి ప్రవేశించాడు. లాకర్లను తెరవకుండా డిస్ప్లేలో ఉన్న నగలను తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నింపుకుని, నిర్మాణంలో ఉన్న లిఫ్టు మార్గంలోని తాడును ఉపయోగించి కిందికి దిగి పరారయ్యాడు. అయితే సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అతడి చేతి మణికట్టుపై ఉన్న టాటూను గుర్తించారు. షోరూంకు గతంలో రెక్కీ కోసం వచ్చిన సమయంలోనూ అదే టాటూ కనిపించడంతో నిందితుడిని గుర్తించగలిగారు. అంతేకాకుండా నవంబర్ 5న కూడా చోరీకి ప్రయత్నించి, కుక్కలు తరమడంతో పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో చోరీకి ఉపయోగించిన ద్విచక్రవాహనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచ్చియార్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కాల్‌డేటా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి, ఆటో డ్రైవర్ సురేష్‌ను అరెస్టు చేశారు. మదురైలోని మాడకుళం ప్రాంతంలోని ఇంటితో పాటు సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నిషాంత్ మాత్రం పరారీలో ఉండటంతో అతడి కోసం తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పొళ్లాచ్చి, తిరుప్పూర్, హైదరాబాద్ ప్రాంతాల వైపు కూడా బృందాలను పంపినట్లు సమాచారం. మరోవైపు షోరూంలో అలారం ఆఫ్‌లో ఉండటం, డిస్ప్లే నగలను లాకర్లలో భద్రపరచకపోవడం, భవనం నిర్మాణం పూర్తికాకపోవడం వంటి భద్రతా లోపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత 30 కిలోల వరకు నగలు చోరీకి గురైనట్లు భావించినప్పటికీ, స్టాక్ తనిఖీ అనంతరం సుమారు 15 కిలోల ఆభరణాలు మాయమైనట్లు నిర్ధారించారు. అరెస్టయిన మీనాక్షి, సురేష్‌లకు ఈ నెల 29 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!