

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ సమాజంపై చెరగని ముద్ర వేసిన తొమ్మిది మందికి రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. విజయవాడలో జరిగిన ఈ పురస్కారాల కార్యక్రమంలో కళలు, యువత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, వైద్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, జర్నలిజం రంగాల్లో ప్రతిభ చాటిన వారిని సత్కరించారు. ఈ ఏడాది అవార్డులు అందుకున్న తొమ్మిది మందిలో ఇద్దరు మహిళలు ఉండటం విశేషం. కేరళకు చెందిన ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మికి కళల విభాగంలో, గణేష్ బరయ్యకు యూత్ ఐకాన్ విభాగంలో, అరుణ్ అరుణాచలానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో, లాడ్లీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దేవేంద్ర కుమార్ గుప్తాకు సామాజిక సేవ విభాగంలో, డాక్టర్ జెమ్మా జె. ఎడాసరీకి వైద్య రంగంలో, మైత్రేయి జచికర్‌కు విద్యా రంగంలో, రాజశేఖర్ రాజుకు గ్రామీణ అభివృద్ధి విభాగంలో, డాక్టర్ రుక్మిణీ రావుకు మహిళా సాధికారత విభాగంలో, ఎం. సుచిత్రకు జర్నలిజం విభాగంలో పురస్కారాలు లభించాయి.
పుట్టుకతోనే చూపు లేకపోయినా సంగీత ప్రతిభతో గుర్తింపు పొందిన వైకోమ్ విజయలక్ష్మి గాయత్రి వీణపై ప్రావీణ్యం సంపాదించడంతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. గుజరాత్‌కు చెందిన గణేష్ బరయ్య శారీరక పరిమితులను అధిగమించి, 2018లో NEETలో 233 మార్కులు సాధించినప్పటికీ మెడికల్ సీటు కోసం న్యాయపోరాటం చేసి MBBS పూర్తి చేశారు. అరుణ్ అరుణాచలం భారతదేశపు తొలి స్వదేశీ ఎండోస్కోప్‌ను అభివృద్ధి చేసి వైద్య సాంకేతికత రంగంలో గుర్తింపు పొందారు. లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దేవేంద్ర కుమార్ గుప్తా బాల్యవివాహాలు, బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తూ 35 లక్షల మందికిపైగా జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. డాక్టర్ జెమ్మా జె. ఎడాసరీ ఒడిశాలోని కలహండి జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. మైత్రేయి జచికర్ ‘జీరో గ్రావిటీ’ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రాజశేఖర్ రాజు నాబార్డ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మూడు రాష్ట్రాల్లోని 250కి పైగా గ్రామాల్లో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి సుమారు రెండు లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారు. డాక్టర్ రుక్మిణీ రావు ఐదు దశాబ్దాలుగా మహిళల హక్కులు, సాధికారత కోసం పోరాడుతున్నారు. ‘సహేలీ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్’, ‘గ్రామ్య’ సంస్థల ద్వారా మహిళలు, బాలికల సంక్షేమానికి సేవలందిస్తున్నారు. కొచ్చికి చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, రచయిత్రి ఎం. సుచిత్ర పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, సామాజిక న్యాయం, ప్రజా వైద్యం, ఆదివాసీల హక్కులపై తన కథనాల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!