

ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత ఇప్పుడు విమానయాన రంగంలోనూ కొత్త శకం ప్రారంభమవుతోంది. చైనా 19 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న భారీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కామ్యాక్ అభివృద్ధి చేసిన 10 టన్నుల బరువైన ‘CE-25A’ విమానం నవంబర్ 14న షాన్డాంగ్ ప్రావిన్స్‌లో తొలి పైలట్ సహిత ప్రయోగాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్‌తో ఈ విమానం గాల్లోకి ఎగిరింది. ఈ ప్రయోగం మొత్తం 57 నిమిషాల 46 సెకన్ల పాటు సాగగా.. అందులో 16 నిమిషాల 38 సెకన్ల పాటు విమానం గాల్లో ఉంది. ఈ సమయంలో 60.4 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. సాధారణ విమానాల మాదిరిగా జెట్ లేదా టర్బోప్రాప్ ఇంజిన్లపై ఆధారపడకుండా, రెక్కల వెంట అమర్చిన ఎలక్ట్రిక్ ఫ్యాన్లతో పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు.
ఈ CE-25A విమానం గంటకు గరిష్ఠంగా 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని సమాచారం. దీని గరిష్ఠ టేకాఫ్ బరువు 10 టన్నులు కాగా.. 2,400 మీటర్ల ఎత్తు వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CATL, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ సహకారంతో ఈ విమానాన్ని రూపొందించారు. భవిష్యత్తులో మరింత పెద్ద ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానాలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. చైనా పౌర విమానయాన సంస్థ ఇప్పటికే ఈ విమానానికి సంబంధించిన టైప్ సర్టిఫికేషన్ దరఖాస్తును స్వీకరించినట్లు సమాచారం. అయితే సాధారణ ప్రయాణికులను అనుమతించేందుకు మరిన్ని పరీక్షలు, ధ్రువీకరణలు, అనుమతులు అవసరం. ఈ ప్రయోగం విజయవంతమైతే పర్యావరణహిత విమానయాన రంగం అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!