

మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సాబర్ (అమూల్) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సుమారు రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ తెలంగాణలో డెయిరీ ప్రాసెసింగ్ రంగానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రారంభ దశలో రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా సుమారు 350 మందికి ఉపాధి లభించడంతో పాటు, పాల సేకరణ మరియు అనుబంధ విలువ గొలుసు ద్వారా దాదాపు 10 వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. పాలు, పెరుగు, పనీర్, ఐస్‌క్రీమ్, లస్సీ, నెయ్యి, మజ్జిగతో పాటు బేకరీ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నట్లు చెప్పారు.
సాబర్ డెయిరీ 2015లో తెలంగాణలో పాల కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి రోజుకు లక్ష లీటర్లకు పైగా పాలను సేకరిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. రైతులు, పాల సేకరణ, ఆధునిక ప్రాసెసింగ్, కోల్డ్‌చెయిన్, ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్ రంగాలను అనుసంధానించే పూర్తి స్థాయి డెయిరీ ఎకోసిస్టమ్‌కు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని అన్నారు. సహకార డెయిరీ విధానంలో వినియోగదారుడు చెల్లించే మొత్తంలో గణనీయమైన వాటా పాల ఉత్పత్తిదారులకు చేరుతుందని, అమూల్ మోడల్‌లో ప్రతి రూపాయిలో సుమారు 80 శాతం వరకు రైతులకు చేరుతుందని పేర్కొన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పెట్టుబడి రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణ ఉపాధి, రైతు ఆధారిత విలువ గొలుసులను బలోపేతం చేసే పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!