

భారత్‌కు ఐదో తరం సుఖోయ్ ఎస్‌యూ-57 యుద్ధ విమానాలను అందించేందుకు రష్యా ప్రతిపాదన చేసిందని భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. రెండు దేశాల సహకారంతో ఈ విమానాలను భారత్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. భారత సైనిక సామర్థ్యంలో వైమానిక శక్తి కీలకమని, భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలతో కూడిన దళాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదే సమయంలో ఫ్రాన్స్‌తో 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ప్రతిపాదించిన మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ఒప్పందాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. ఫిబ్రవరిలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా.. ప్రస్తుతం ధరలు, ఇతర కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఐఏఎఫ్‌కు ఏడాదికి 36–40 యుద్ధ విమానాలు అవసరమవుతాయని, దేశీయంగా యుద్ధ విమానాల ఇంజిన్‌ల తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!