

వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ (CO2) మోతాదులు కేవలం వేడిగాలులు, కరవులు, కార్చిచ్చులు, తీవ్ర తుపాన్ల వంటి పర్యావరణ విపత్తులకే కారణం కాకుండా.. మనిషి ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని Air Quality, Atmosphere & Health జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు అమెరికా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేకు సంబంధించిన 21 ఏళ్ల డేటాను విశ్లేషించారు. ఈ కాలంలో వాతావరణంలోని CO2 మోతాదు 369 పీపీఎం నుంచి 420 పీపీఎంకు పెరగగా.. రక్తంలో CO2 సమతుల్యతను సూచించే బైకార్బొనేట్ మోతాదు సుమారు 7 శాతం పెరిగినట్లు గుర్తించారు.
అధిక CO2ను ఎదుర్కొనే క్రమంలో రక్తంలోని ఆమ్లత్వాన్ని నియంత్రించేందుకు శరీరం బైకార్బొనేట్ స్థాయులను పెంచుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలం అధిక CO2కు గురికావడం వల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రత తగ్గడం, నిర్ణయ సామర్థ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్యాల్షియం, పాస్ఫరస్ స్థాయుల్లో మార్పులు కూడా శరీర క్రియలను ప్రభావితం చేయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్ర ప్రభావాలు విస్తృతంగా కనిపించకపోయినా.. గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు ఇలాగే పెరిగితే ఈ శతాబ్దం మధ్య నాటికి CO2 మోతాదు 500 పీపీఎంను దాటే అవకాశం ఉందని అంచనా. అలా జరిగితే భవిష్యత్ తరాల ఆరోగ్యంపై మరింత తీవ్రమైన ప్రభావాలు పడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!