

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని రోడ్ నెట్‌వర్క్ ప్రాజెక్టులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రేడియల్ రోడ్లు, భూసేకరణ, రుణ సేకరణ, నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని రహదారి ప్రాజెక్టులను సమన్వయంతో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై సరైన నిర్వహణ లేకపోవడం, వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపివేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్-1ను డిసెంబర్ 9లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రోడ్ల నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని, రహదారుల వెంట పచ్చదనం పెంపొందించాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, బంజారాహిల్స్-శిల్పా లేఅవుట్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని అరికట్టాలని, టీడీఆర్‌ల జారీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!