

తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. పెరటాసి మాసం మూడో వారం నేపథ్యంలో తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏకంగా 5.72 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 2.44 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.32.66 కోట్ల ఆదాయం సమకూరగా, సుమారు 30 లక్షల లడ్డూలు విక్రయించినట్లు సమాచారం.
భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు దర్శన సమయం పెంచేందుకు అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయితే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మినహాయింపు కొనసాగనుంది. అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీతో పాటు తిరుమలలో వసతి గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, వైద్య సదుపాయాలను టీటీడీ అందిస్తోంది. భక్తులు సంయమనంతో వ్యవహరించి సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!