

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. అనూహ్య ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోగా, భారతీయ జనతా పార్టీ తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందన చర్చనీయాంశమైంది. ఘోర ఓటమి తర్వాత కూడా ఆమె వెంటనే గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించకపోవడం గమనార్హం. శనివారం ఉదయం వరకు కూడా ఆమె X ప్రొఫైల్‌లో “గౌరవనీయ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అనే పదవిని కొనసాగించారు.
ఈలోగా సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మమత తన ప్రొఫైల్‌ను నిశ్శబ్దంగా మార్చారు. అయితే “మాజీ” అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించకుండా, “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)”గా పేర్కొన్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా తనను చూపించారు. ఈ మార్పు ఆలస్యంగా చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఎలోన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ స్పందించారు. అయితే ఈ మార్పుతో మమత పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు భావిస్తున్నారు. మే 7న అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి సభను రద్దు చేయగా, ఆమె ముఖ్యమంత్రి పదవి స్వయంచాలకంగా ముగిసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!