

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఇజ్రాయెల్, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించేందుకు ఇరాన్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ అనుబంధ మెహర్ న్యూస్ ఏజెన్సీ శనివారం రాత్రి ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు చూపించే 12 సెకన్ల వీడియోను విడుదల చేసింది. అయితే, ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
కొన్ని రోజులుగా మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని, పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఛానల్ 14 కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన తాజా వీడియోపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యుద్ధం ప్రారంభానికి ముందు కోమ్ నగరంలో చిత్రీకరించిన పాత వీడియో కావచ్చని కొందరు అంతర్జాతీయ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. ఖమేనీ ప్రజల ముందుకు ప్రత్యక్షంగా రాకపోవడం, ఆయనతో నేరుగా సంప్రదింపులు జరపడం కష్టంగా మారిందని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గతంలో చెప్పడం కూడా చర్చకు కారణమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!