

సముద్ర కోతతో తీవ్రంగా ప్రభావితమవుతున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ.323 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగిస్తూ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్‌డీఎంఎఫ్) ఆమోదంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణులు శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీరానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. ఐఐటీ మద్రాస్‌తో ఒప్పంద ప్రక్రియ పూర్తికావడంతో నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, సమీప మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!