

గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నీటిపారుదల శాఖపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ఎత్తిపోతలకు సంబంధించి చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచనల మేరకే నీటిని నిల్వ చేయడం లేదని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి వివరించగా, ఈ అంశంపై ఎన్‌డీఎస్ఏతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసంపై వాస్తవ నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీటిని నింపే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!