

దేశవ్యాప్తంగా మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) అధికారులు విచారణ ప్రారంభించి రాజస్థాన్, డెహ్రాడూన్ ప్రాంతాల్లో 13 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందే 400కు పైగా ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిలో అనేక ప్రశ్నలు అసలు నీట్ పరీక్షతో సరిపోలినట్లు అధికారులు గుర్తించారు.
ఎస్ఓజీ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యంగా జీవశాస్త్రం, రసాయనశాస్త్రానికి సంబంధించిన 100కు పైగా ప్రశ్నలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సారూప్యంగా ఉన్నట్లు తేలింది. అయితే ఇవి కేవలం అంచనా ప్రశ్నలేనా? లేక పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందా? అన్న కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను జైపూర్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశముందని సమాచారం.
ఇదిలా ఉండగా.. మే 3న దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ పరీక్షను నిర్వహించినట్లు ఎన్టీఏ తెలిపింది. మే 7న రాత్రి అనుమానాస్పద సమాచారం అందడంతో మరుసటి ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దర్యాప్తు సంస్థలకు అవసరమైన సాంకేతిక సమాచారం, పరీక్ష డేటాను అందిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!