

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యావిధానాలను అధ్యయనం చేసిన తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల విద్యావిధానాలను పరిశీలించాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నిర్ణయం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు, నష్టాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకుడు కె. శ్రీనివాస్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) నాయకుడు యాదగిరి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అశోక్, ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ట్రస్మా నాయకులు మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులపై వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!