

కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తుమకూరు గ్రామీణ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీరంగపట్నం తాలూకా ఆరతి ఉక్కడలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భీమన అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో గర్భగుడిలోకి వెళ్లేందుకు ఐశ్వర్య ప్రయత్నించగా, భద్రతా విధుల్లో ఉన్న మహిళా ఎస్సై సవిత బి. పోలీస్ పాటిల్ ఆమెను అడ్డుకుని కొంతసేపు వేచి ఉండాలని కోరినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా, ఐశ్వర్య ఎస్సైపై చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎస్సై సవిత ఫిర్యాదు మేరకు క్యాతనహళ్లి పోలీసులు ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, పోలీస్ అధికారి తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐశ్వర్య కూడా కౌంటర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, సామాన్య భక్తుల క్యూలైన్లు, విధుల్లో ఉన్న పోలీసులపై రాజకీయ పలుకుబడి ప్రభావం వంటి అంశాలపై చర్చ మొదలైంది. వివాదంపై ఎమ్మెల్యే సురేశ్ గౌడ స్పందిస్తూ తన కుమార్తె ప్రవర్తనపై క్షమాపణలు చెప్పారు. ఆమె తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆలయాల్లో వీఐపీ దర్శన విధానాన్ని పునరాలోచించాలని, దేవుడి ముందు అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!