

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదుకు పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు అవసరమైన ధ్రువపత్రాలతో బీమా పథకం నమోదు కోసం కార్యాలయాలకు వెళ్తుండగా, ఇంటి పన్ను చెల్లించిన వారి వివరాలను మాత్రమే కార్యదర్శులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించని వారి వివరాలను నమోదు చేయడం లేదని వాపోతున్నారు. ఈ విషయంపై పలువురు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ప్రశ్నించినప్పటికీ, ఇంటి పన్ను చెల్లిస్తేనే బీమా పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు పథకంలో నమోదు చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు అధికారులు సుమారు రూ.లక్ష వరకు ఇంటి పన్ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్లిందని పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే, ఈ అంశంపై పాలకుర్తి ఎంపీడీవో రమేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇంటి పన్ను చెల్లింపుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!