

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (HMDA) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విశాలమైన రహదారులు, ఆధునిక మౌలిక వసతులు, పార్కులు, గ్రీన్ స్పేస్‌తో ఈ లేఅవుట్‌ను తీర్చిదిద్దనుంది. గతంలో కోకాపేటలోని నియోపొలిస్‌లో 500 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన HMDA.. ప్రస్తుతం బుద్వేల్‌లోనూ ఇలాంటి ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాంతాల్లో భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఇదే తరహాలో మియాపూర్ భూములను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.600-700 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ భూముల విక్రయానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ముంబయి జాతీయ రహదారికి కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండటంతో ఈ భూములకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, ఈ భూములపై దాదాపు 23 ఏళ్లుగా ప్రైవేటు వ్యక్తులు, సొసైటీలు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగింది. ఇటీవల సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, మొత్తం 550 ఎకరాలు ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. తీర్పు అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్, HMDA అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి భూములను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం భూమిలో 110 నుంచి 150 ఎకరాల వరకు ఆక్రమణల్లో ఉండగా, అక్కడ ఇప్పటికే కాలనీలు, బస్తీలు ఏర్పడ్డాయి. వాటిని తక్షణమే ఖాళీ చేయించే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆక్రమిత ప్రాంతాలను మినహాయిస్తే సుమారు 386 నుంచి 400 ఎకరాల భూమి అభివృద్ధికి అందుబాటులో ఉంది. ఇందులో దాదాపు 150 ఎకరాలను రహదారులు, పార్కులు, సామాజిక మౌలిక వసతులు, పచ్చదనం కోసం కేటాయించనున్నారు. మిగిలిన ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ధి చేసి త్వరలో ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు HMDA ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!