

కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ఘాటు సందేశం ఇచ్చారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కోడింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నారని, మార్కెటింగ్ ఉద్యోగులు ప్రచార ఆలోచనల కోసం చాట్‌జీపీటీని ఆశ్రయిస్తున్నారని, డిజైనర్లు మిడ్‌జర్నీ వంటి సాధనాలతో డిజైన్లు రూపొందించుకుంటున్నారని వర్మ పేర్కొన్నారు. ఇలా ఉద్యోగులు తమ పనులను ఏఐతో చేయించుకుంటూ, ఆ క్రెడిట్‌ను మాత్రం తమ ఖాతాలో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కంపెనీలు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని, ఉద్యోగుల పనితీరు, సంస్థల లాభనష్టాల గణాంకాలే వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఏఐకి జీతం చెల్లించాల్సిన అవసరం లేదని, సెలవులు కూడా ఉండవని వర్మ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఉద్యోగాల విషయంలో కంపెనీలకు మానవ వనరుల అవసరం తగ్గవచ్చని, ఫలితంగా తొలగింపులకు సిద్ధమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉద్యోగులు తమ పనులను ఏఐకి అప్పగిస్తూ జీతాలు తీసుకుంటున్నప్పుడు.. ఉద్యోగాలు పోయిన తర్వాత సాంకేతికతను నిందించడం, కంపెనీలు మోసం చేశాయని ఆరోపించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏఐని ఉపయోగించడంలో తప్పు లేదని, దాన్ని సమర్థంగా, సరైన విధంగా వినియోగించుకోవడమే ముఖ్యమని తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!