

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌కు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఘాటుగా స్పందించారు. రాయలసీమ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి అడ్డుపడింది జగనేనని ఆయన విమర్శించారు. కేసీఆర్ హెచ్చరించడంతోనే జగన్ రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేశారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కాల్వ గుర్తుచేశారు. జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. న్యాయస్థానం స్టే విధించిన తర్వాత కూడా మూడున్నరేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ అప్పీల్ దాఖలు చేయలేదని విమర్శించారు.
ముచ్చుమర్రి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తక్కువ నీటిమట్టం వద్దే నీటిని తీసుకునే అవకాశం ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని విమర్శించారు. హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను పట్టించుకోలేదని, విద్యుత్ బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మాత్రం హంద్రీ-నీవా కాల్వల కోసం ఏడాదిలోనే రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసించారు. కాగా, ఈ ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, జగన్ ఇటీవల పథకాన్ని సమర్థించుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!