

విద్యార్థుల ఆకలి తీర్చి, వారి చదువుకు తోడ్పాటునందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సింగరేణి సంస్థ అండగా నిలుస్తోంది. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు రూ.61.44 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ ఈ వంటశాలలను నిర్వహించనుంది. వీటి ద్వారా సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా పౌష్టిక అల్పాహారం అందించనున్నారు.
తొలిదశలో కొడంగల్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన కిచెన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ వంటశాలలు ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల కోసం రూ.21.03 కోట్లు కేటాయించగా, సింగరేణి, కొత్తగూడెం, సూర్యాపేట (మునగాల), కాగజ్‌నగర్, భూపాలపల్లి ప్రాంతాల్లో కిచెన్ల ఏర్పాటుకు మరో రూ.38.41 కోట్లు కేటాయించారు. గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడతాయని భావిస్తున్నారు. మధ్యలోనే చదువు మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించడానికీ ఈ పథకం తోడ్పడుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పాఠశాల భవనాలు, మౌలిక సదుపాయాల కోసం సీఎస్ఆర్ నిధులు అందించిన సింగరేణి, ఇప్పుడు విద్యార్థుల పోషకాహార కార్యక్రమంలోనూ భాగస్వామ్యమవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!