

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విటర్) టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్ 26, గురువారం X అధికారిక సేఫ్టీ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న వినియోగదారుల ఖాతాలకు ఈ నియంత్రణలు వర్తిస్తాయి. కొత్త విధానం ప్రకారం ఈ వయసు వారితో కూడిన ఖాతాలు ఆటోమేటిక్‌గా ప్రొటెక్టెడ్ మోడ్‌లోకి వెళ్తాయి. దీంతో సున్నితమైన కంటెంట్‌ను వీక్షించడం, లక్ష్యిత ప్రకటనలు అందుకోవడంపై పరిమితులు ఉంటాయి. తల్లిదండ్రులకు అవసరమైన నియంత్రణలు కల్పిస్తూనే, టీనేజర్లు తమ ఖాతాలపై హక్కును కొనసాగించేలా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు X సేఫ్టీ విభాగం అధిపతి మైఖేల్ ఓ'హెర్లిహీ తెలిపారు.
ఈ ఫీచర్ ద్వారా పిల్లలు వారంలో Xలో ఎంత సమయం గడుపుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. రోజువారీ స్క్రీన్ టైమ్ పరిమితులను విధించడంతో పాటు, కొత్త ఫాలోవర్లను ఆమోదించడం, పిల్లలు ఫాలో అయ్యే ఖాతాల పోస్టులు, వీడియోలకే ఫీడ్ సిఫార్సులను పరిమితం చేయడం, నిర్దిష్ట పదాలు కనిపించకుండా నియంత్రించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. పిల్లలకు ఎవరు డైరెక్ట్ మెసేజ్‌లు పంపవచ్చో నిర్ణయించడంతో పాటు, వారు ఎవరితో మెసేజ్‌లు మార్పిడి చేసుకుంటున్నారో కూడా తల్లిదండ్రులు చూడవచ్చు. ఫొటోల్లో ట్యాగ్ చేసే అవకాశం, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా ఖాతాను గుర్తించే సదుపాయం, పోస్టుల్లో లొకేషన్ వివరాలను కూడా నియంత్రించవచ్చు. అయితే పిల్లల ప్రైవేట్ మెసేజ్‌లను చదవడం, సెర్చ్, వీక్షణ చరిత్రను చూడడం లేదా వారి తరఫున పోస్టులు చేయడం తల్లిదండ్రులకు సాధ్యం కాదు. తమ ఖాతాలపై విధించిన పరిమితులను టీనేజర్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో X ఈ చర్యలు చేపట్టింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!