

హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ఇటీవల మెహిదీపట్నం, ఖైరతాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు ఆహార విక్రయ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు టీజీ సేఫ్ పేరుతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు బయటపడటంతో పలు హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, లోపాలను సరిదిద్దుకోవాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, కొన్ని సంస్థలు తాత్కాలిక మార్పులు చేసి తిరిగి లైసెన్సులు పొందుతుండటంతో పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోనూ గడువు ముగిసిన ఆహార పదార్థాలు భారీగా బయటపడుతున్నాయి. వంటగదుల్లో అపరిశుభ్రత, ఈగలు, ఎలుకలు, బొద్దింకల సంచారం, సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం వంటి సమస్యలు వినియోగదారుల ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉల్లంఘనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఫుడ్ సేఫ్టీ విభాగంలో సిబ్బంది కొరత నిరంతర తనిఖీలకు ప్రధాన అడ్డంకిగా మారింది. నగరవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సుమారు 290 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా.. ప్రభుత్వం 103 పోస్టులనే మంజూరు చేసింది. వీటిలో ప్రస్తుతం 44 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల దుకాణాలు, తోపుడు బండ్లు ఉండగా.. వాటిని పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో కేవలం 15 మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. టీజీ సేఫ్ ఏర్పాటైన తర్వాత పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్యూర్ పరిధిలో ఇప్పటివరకు 450 హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా.. 150కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 120కి పైగా లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు సుమారు 90 టన్నుల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ, నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఉల్లంఘనలు మళ్లీ పునరావృతమవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించి, ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!