

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శనివారం మధ్యాహ్నం నీటిమట్టం 56.2 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరికి శబరి నది కలవడంతో పోలవరం జిల్లా ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జాతీయ రహదారులు 30, 326పై వరద నీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు ఐటీడీఏ పరిధిలో 44 ప్రధాన, అనుసంధాన రహదారులు దెబ్బతినగా, దాదాపు 24 వేల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 608 కుటుంబాలకు చెందిన 1,668 మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు చేర్చారు.
వరద ప్రభావం ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు కూడా విస్తరించింది. కూనవరం, వీఆర్పురం మండలాల్లో వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలను పడవలు, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 48 గేట్ల ద్వారా సుమారు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, అధికారులు అప్రమత్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రానున్న గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!